గురు తత్వము

గురువు అంటే ఎవరు?

మనకు తెలియని ఆధ్యాత్మిక ప్రపంచంలో మార్గం చూపే దీపం గురువు. ఏ రంగంలో అయినా మనకు మార్గం చూపే గురువు ఉండడం అనేది అమూల్యమైనది. ఇది ఆధ్యాత్మికతలో  కూడా వర్తిస్తుంది. ఆధ్యాత్మికత మనకు కనపడని, సూక్ష్మశాస్త్రం అయినందువలన ఆధ్యాత్మికంగా ఎదిగి మార్గం చూపించగల గురువును గుర్తించడం ఎంతో కష్టమైన విషయం. గురువు అధ్యాపకునికన్నా, బోధకుడికన్నా చాలా భిన్నమైన వాడు. అతడు ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక దీపం వంటి వాడు. అన్ని కుల-మతాలకు, సంస్కృతికి ఆధారమైన విశ్వ ఆధ్యాత్మిక శాస్త్రమును మనకు నేర్పిస్తాడు.

గురువు మరియు ‘ఆధ్యాత్మిక మార్గదర్శి’కి నిర్వచనం

అత్యున్నతమైన భగవంతుని తత్వమునకు ఎన్నో స్వరూపాలు ఉన్నాయి. భగవంతునికి చెందిన ఈ వివిధ స్వరూపాలు విశ్వంలో నిర్దిష్ట విధులను నిర్వహిస్తూ ఉంటాయి. ఒక దేశ సమగ్ర పాలన, కార్యాచరణను సులభతరం చేసేందుకు ఆ దేశ ప్రభుత్వంలో వివిధ శాఖలు ఉన్నట్లుగానే ఇది కూడా. ఆధునిక విజ్ఞానాన్ని దేశవ్యాప్తంగా అందరికీ బోధించడం సుసాధ్యం చేయడానికి ప్రభుత్వంలో విద్యా శాఖ ఉన్నట్లు గానే  విశ్వంలో ఆధ్యాత్మిక బోధన, ఆధ్యాత్మిక పురోగతికి కృషి చేసే భగవత్‌ స్వరూపమునే ‘గురువు’ అంటారు. దీనినే కనబడని మరియు అవ్యక్త గురువు అనీ, భగవంతుని బోధనా సూత్రం అనీ అంటారు. అవ్యక్త గురువు విశ్వమంతా వ్యాపించి ఉంటారు; మనం జీవించి ఉన్నప్పుడు, మరణం తరువాత కూడా ఎల్లప్పుడూ మనతో ఉంటారు. అతి ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే అవ్యక్త గురువు జీవితాంతం మనకు తోడుగా ఉంటూ మనల్ని నెమ్మదిగా ప్రాపంచిక జీవనం నుండి ఆధ్యాత్మిక జీవన విధానం వైపు నడిపిస్తారు. గురువు మన ఆధ్యాత్మిక స్థాయిని బట్టి, జ్ఞానాన్ని గ్రహించగల సామర్థ్యాన్ని బట్టి మనకు మార్గ నిర్దేశం చేస్తూ మనలో పట్టుదల, అంకిత భావం, శ్రద్ధ,  దృఢత్వం, కరుణ మొదలగు సద్గుణాలను పెంపొందిస్తారు. ఒక మంచి సాధకుడికి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ గుణాలన్నీ చాలా అవసరం. తమ ఆధ్యాత్మిక ప్రగతికై తపనతో కృషి చేసే వారిని గురువు అవ్యక్త రూపంలో వారి ప్రగతికి ఏది అవసరమో దాని ప్రకారం ముందుకు నడిపిస్తారు.

ప్రపంచంలోని మొత్తం జనాబాలో కొందరు వ్యవస్థీకృత, సాంప్రదాయ మతాల చేత పరిమితం కాని సాధనా మార్గాన్ని ఎన్నుకుంటారు. వీరిలో అతి కొందరు మాత్రమే (జన్మతః అందిపుచ్చుకున్న మతంతో నిమిత్తం లేకుండా) వారి ఆధ్యాత్మిక సాధన ద్వారా 70% ఆధ్యాత్మిక స్థాయిని చేరుకుంటారు. అప్పుడు అవ్యక్త గురువు ఈ కొందరు మానవ రూపంలో ఉన్న ఈ ప్రత్యక్ష గురువుల ద్వారా కార్యం చేస్తారు.

వేరే మాటలలో చెప్పాలి అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గదర్శి లేదా గురువుగా అర్హత పొందడానికి అతని ఆధ్యాత్మిక స్థాయి కనీసం 70% ఉండాలి. మానవ రూపంలో ఉన్న ప్రత్యక్ష గురువు మానవాళికి ఆధ్యాత్మిక దీపికగా ఉంటారు. వారు విశ్వ మనస్సు, విశ్వ బుద్ధితో ఏకమై ఉంటారు.

‘గురువు’ అనే పదమునకు యథామూలమైన అర్థం :

‘గురు’ అనునది సంస్కృత పదము. దీనికి చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉన్నది. ‘గు’, అనేది సామాన్య మానవులలో ఉండే ఆధ్యాత్మిక అజ్ఞానానికి ప్రతీక. ‘రు’ అనగా ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని తొలగించే ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశమునకు ప్రతీక.

క్లుప్తంగా చెప్పాలంటే, గురువు అంటే ఆధ్యాత్మిక అజ్ఞానాంధకారాన్ని తొలగించి, ఆధ్యాత్మిక అనుభవాలను, జ్ఞానాన్ని ప్రసాదించే వారు.

గురుతత్వం

భక్తి, చైతన్యం, జ్ఞానం, వైరాగ్యం, ఆనందం, శాంతి, గురువు, సత్సంగం, సత్సేవా, నామము, త్యాగం, శిష్యుడు – గురుతత్వం

ఆషాఢ మాస శుద్ధ పౌర్ణమి నాడు గురు పూర్ణిమ జరుపుకుంటారు.

గురు తత్వానికి కృతజ్ఞతలు వ్యక్తం చేయడానికి ప్రతి ఏడాది గురు పూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజు ఆది గురువు వ్యాస మహర్షి (గురు శిష్య పరంపర స్థాపకులు) పూజింపబడతారు. అందుకే ఈ రోజును ‘వ్యాస పూర్ణిమ‘ అని కూడా అంటారు. ఒక సాధకుడి జీవితంలో ఇదే అత్యంత ముఖ్యమైన పండుగ. గురువు భగవంతుడి ప్రత్యక్ష రూపము. కాబట్టి, ఈ కృతజ్ఞతా పూర్వక ఉత్సవం కూడా సాధకుడి ఆధ్యాత్మిక పురోగతి కోసమే జరుపుకుంటారు.

ఈ రోజు గురు తత్వము ఇతర రోజుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ కార్యనిరతరమై ఉంటుంది.  అందుకే సాధకులు, భక్తులు, తనువు, మనస్సు మరియు ధనము సమర్పించి సత్‌ సేవలో పాలుపంచుకుంటారు. గురు పూర్ణిమ సన్నాహాలు, వేడుకలలో పాల్గొనడం ద్వారా సాధకులకు గురు తత్వము యొక్క సేవ ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించే అపూర్వమైన అవకాశం లభిస్తుంది.

కాబట్టి, మతం, ఆధ్యాత్మిక మార్గంతో నిమిత్తం కాకుండా సాధకులందరికి గురు పూర్ణిమ ఎంతో ప్రధానమైనది.

గురువును ప్రాప్తించుకోడానికి ఏమి చెయ్యాలి?

త్వరగా గురువును  ప్రాప్తించుకోవడం, తరువాత ఎల్లప్పుడూ గురువుగారి కృపకు పాత్రులుగా ఉండటం కేవలం గురువు గురించిన తీవ్ర ముముక్షుత్వం (తపన) ద్వారానే సాధ్యం. ఒక యువకుడు ఒక అమ్మాయి మనసుని గెలుచుకోవడానికి నిరంతరం తను ఏమి చేసి ఆమెను సంతోషపెట్టగలను అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే, మనం కూడా పగలూ రాత్రి గురువులకు ఇష్టమైన పనులను చేస్తూ,  గురువుగారు మనల్ని తన వారుగా భావించి, మనపై తన కృపను  వర్షించేలా చేయాలి.

Chitr- నిరంతర ప్రయత్నం, సాధన ప్రారంభించడం- ఇలవేల్పు ఆరాధన, నామజపం, సత్సంగం, సత్సేవా, అధ్యాత్మిక స్థాయి-55%- మోక్షం

కలియుగంలో గురువును, ఆయన కృపను పొందడం పూర్వకాలములో కన్నా సులభం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గురుకృప లేనిదే అతనినిప్రాప్తించుకోలేము. ఎవరు తన శిష్యులవుతారో అనేది గురువుకు ముందుగానే తెలిసివుంటుంది. గురుకృపను పొందడానికి మనం ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి. అందుకు, మనం శిష్యత్వానికి అవసరమైన గుణాలను పెంపొందించుకోవాలి.

గురు తత్వము ఒక్కటే

బయటికి భౌతిక రూపములు వేరుగా ఉన్నా, గురువులందరూ ఒక్కటే. ఎలా అయితే ఆవు పొదుగు నుండి వచ్చే పాలు అన్నీ  స్వచ్చమైనవో అలాగే అందరు గురువులలోనూ ఉన్న గురు తత్వము ఒక్కటే, అందరి నుండి వెలువడే ఆనందపు తరంగాలు కూడా ఒక్కటే. సముద్రపు తరంగములు ఒడ్డు వైపు పరుగులు తీసినట్లు భగవంతుడి తరంగములైన గురువులు సమాజము వైపు వెలువడతారు. సముద్రపు తరంగాలన్నిటి నీటి రుచి ఒక్కటే. అలాగే, గురువులందరి తత్వము ఒక్కటే.

ఒక నీటి గంగాళానికి (ట్యాంక్‌) ఎన్నో రంధ్రాలు ఉంటే, అన్ని చిన్న లేదా పెద్ద రంధ్రాల ద్వారా ఒకటే నీరు బయటకు కారుతుంది. విద్యుత్‌ దీపముల ఆకారములు వేరు వేరుగా ఉన్నా, వాటి ద్వారా విద్యుత్తు ప్రవహించినప్పుడు వాటన్నిటి ద్వారా వెలుగే ప్రసరింపబడుతుంది. అలాగే, గురువుల భౌతిక స్వరూపాలు వేరుగా ఉన్నా, వారిలోని, గురు తత్వము, భగవత్‌ తత్వము ఒక్కటే అయి ఉంటుంది.

మూలం: సనాతన రచనలు ‘గురుకృపాయోగం’ మరియు ‘శిష్యుడు’

Leave a Comment